దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi Movie). హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక.. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని సెన్సేషనల్ విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
14 నెలలుగా శ్రమిస్తున్నాం.. అద్భుతమైన స్లో-మోషన్ జంప్స్!
సినిమా విశేషాల గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “నేను దాదాపు 14 నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసమే వర్క్ చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, రాజమౌళి గారు ఒక సినిమాను పర్‌ఫెక్ట్‌గా స్క్రీన్ మీదకు తీసుకురావడానికి చాలా సమయం తీసుకుంటారు. ఆయన ప్రతి చిన్న సీన్‌ను, ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో క్షుణంగా పరిశీలిస్తారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం చాలా అద్భుతమైన, మైండ్ బ్లోయింగ్ స్లో మోషన్ జంప్స్ (యాక్షన్ సీక్వెన్సెస్) చేశాను. ప్రస్తుతానికి నేనింతకంటే ఎక్కువ రహస్యాలు చెప్పలేను” అంటూ నవ్వేసింది.
ఇటీవల మరో సందర్భంలోనూ ప్రియాంక ఈ చిత్రంపై స్పందిస్తూ.. తాను తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే ‘వారణాసి’ పూర్తిగా భిన్నమైనదని, ఒక సరికొత్త అనుభూతిని ఇస్తోందని కొనియాడింది.
రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ కల్లా ప్యాకప్!
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు జక్కన్న రీసెంట్‌గా ప్రకటించారు. రాబోయే అక్టోబర్ నాటికి ప్యాచ్ వర్క్‌తో సహా టోటల్ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుంది.
షూటింగ్ ముగిసిన వెంటనే భారీ ఎత్తున పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ (VFX) పనులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ల జాతరను మొదలుపెట్టనున్నారు. కాగా, ఈ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.