బాలీవుడ్ షెహన్షా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (83) చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి ఆయన రాసుకొచ్చిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఐసీయూ అనుభవంపై బిగ్ బీ ఆవేదన!
తన వ్యక్తిగత బ్లాగులో అమితాబ్ స్పందిస్తూ.. “నిపుణులైన డాక్టర్ల సంరక్షణలో కొన్ని రోజులు ఐసీయూలో ఉండి సర్జరీ అనంతరం డిశ్చార్జ్ అయ్యాను. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చే ఈ సమయం శారీరకంగా, మానసికంగా, ప్రాక్టికల్‌గా అత్యంత కష్టతరమైన దశ. మీరు ఎంత గొప్ప విజేత అయినప్పటికీ, ఏదో ఒక రోజు ఓటమి మిమ్మల్ని ఎదుర్కొంటుంది. జీవితంలో ఇది అత్యంత క్లిష్టమైన సమయం” అని తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ వచ్చిన కొద్దిసేపటికే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా.. “ఆట ముగిసింది! కానీ పని ఇంకా కొనసాగుతోంది” అంటూ ఆయన మరొక రహస్య సందేశాన్ని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది..
ఆందోళనలో ఫ్యాన్స్.. స్పష్టత రాని సర్జరీ వివరాలు!
అమితాబ్ బచ్చన్ ఈ పోస్ట్‌లో సర్జరీ, ఐసీయూ ప్రస్తావన తెచ్చినప్పటికీ.. అసలు ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? ఏ అనారోగ్య సమస్య కారణంగా సర్జరీ చేయాల్సి వచ్చింది? అన్న విషయాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.
కాగా, 83 ఏళ్ల వయసులోనూ బిగ్ బీ వరుస సినిమాలు, టీవీ షోలతో నిరంతరం బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అశ్వత్థామగా అలరించిన ఆయన, నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది.