నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #NBK111 (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
కాకినాడ పోర్ట్‌లో ఘటన.. షూటింగ్ నిలిపివేత!
కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో బాలకృష్ణ మరియు నటుడు మంచు మనోజ్ మధ్య ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రమైన స్టంట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలయ్య మోకాలికి స్వల్ప గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసింది.
స్పాట్లోనే ప్రాథమిక చికిత్స.. విశ్రాంతిలో బాలయ్య!
గాయపడిన వెంటనే వైద్య బృందం బాలకృష్ణకు స్పాట్లోనే ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లోని ప్రత్యేక విడిదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం స్వల్పమైనదేనని తెలుస్తుండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశముంది.
ముంబయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా NBK111!
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముంబయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆయన సరసన చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.