సామాజిక ఇతివృత్తాలతో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్జిబీటీ – ఏ లీగల్ బ్యాటిల్” (LGBT – A Legal Battle). శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఇటీవల విడుదలవుతూ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
క్రిటిక్స్ అసోసియేషన్ ఘన సన్మానం
వల్లూరి రాఘవరావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాదరావు, సెక్రట్రీ సురేష్ కొండేటి మరియు ఇతర సభ్యులు చిత్రబృందాన్ని శాలువా, బొకేలతో ఘనంగా అభినందించారు. ఆత్మనూనత, ఆత్మగౌరవం మధ్య నలిగిపోయే ట్రాన్స్జండర్ వ్యక్తుల జీవితాలను సునీల్ కుమార్ రెడ్డి ఎంతో నైపుణ్యంతో ఆవిష్కరించారని ప్రసాదరావు కొనియాడారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా సింగిల్ థియేటర్లో 30 రోజులు ఆడటం గొప్ప విషయమని, ఈ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డులు రావాలని ఆకాంక్షించారు.
ఇంత గొప్ప దర్శకుడిని ఇండస్ట్రీ ఎందుకు గుర్తించలేదు?: ఎల్.బి. శ్రీరామ్
ఈ చిత్రంలో జడ్జి పాత్రలో మెప్పించిన సీనియర్ నటుడు ఎల్.బి. శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “పి. సునీల్ కుమార్ రెడ్డి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పటివరకు సరిగ్గా గుర్తించకపోవడం అవమానకరం. ఆయన జర్నలిజాన్ని పక్కనపెట్టి సినిమాలు తీస్తూ ఎన్నో కష్టాలు చూశారు. సమాజంలో ట్రాన్స్జండర్ల ఆచారాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను అద్భుతంగా చూపించారు. న్యాయస్థానంలో కళ్లకు గంతలు కట్టిన జడ్జిగా వారు చెప్పే బాధలను వినడమే నా బాధ్యతగా నటించాను” అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
బాధిత కుటుంబాల, కమ్యూనిటీ ప్రతినిధుల ఎమోషనల్ స్పీచ్
ఒక ట్రాన్స్జండర్ మహిళకు తల్లి అయిన ముకుంద మాట్లాడుతూ.. పాఠశాల దశ నుంచే పిల్లలు పడే అవమానాలను ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించిందని, ప్రతీ ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలవాలని కోరారు. అలాగే తెలంగాణ ట్రాన్స్జండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా ఓరుగంటి, పోలీస్ ఇన్స్పెక్టర్ దాసు, నటులు ఆనంద్ చక్రపాణి, విష్ణు తేజ, నటి సనా ఖాన్ తదితరులు మాట్లాడుతూ.. కమ్యూనిటీ హక్కుల పోరాటాన్ని కమర్షియల్ హంగులకు పోకుండా యథార్థంగా తెరకెక్కించినందుకు దర్శకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
2027లో ‘ఎల్జిబీటీ’ సీక్వెల్ ప్రకటన!
ఈ సందర్భంగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను పలు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయడానికి ఆహ్వానాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో 2027లో ‘ఎల్జిబీటీ’ రెండవ భాగాన్ని (Part-2) ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.