Find Articles

‘చిట్టిబాబు’గా వెంకీ మామ..’ఆదర్శ కుటుంబం’ గ్రాండ్ అప్‌డేట్

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు త్రివిక్రమ్ రాత అందించినప్పటికీ, పూర్తిస్థాయి దర్శకుడిగా వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఏళ్లకు పైగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నెరవేరుతూ తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ (Aadarsha Kutumbam: House No.47).

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

‘చిట్టిబాబు’గా వెంకీ మామ.. కుటుంబ ప్రపంచం పరిచయం!

ప్రేక్షకులను ‘ఆదర్శ కుటుంబం’ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జులై 27న ఒక స్పెషల్ అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సినిమాలో కీలక పాత్రల వివరాలను కూడా వెల్లడించారు.

ఈ చిత్రంలో వెంకటేష్ ‘చిట్టిబాబు’ అనే మధ్యతరగతి కుటుంబ పెద్దగా, ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలో అలరించనున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ‘స్వర్ణ’గా కథానాయిక పాత్రలో నటిస్తుండగా.. ‘సంపూర్ణ’గా యువిన పార్వతి, ‘శర్వా’గా రాజ్ ప్రజ్వల్ నటిస్తున్నారు.

అక్టోబర్ 2న థియేటర్లలోకి రచ్చ!

కుటుంబ నేపథ్యానికి పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలను జోడించి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారు. కాగా, ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. జులై 27న రాబోతున్న స్పెషల్ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Keerthi