విలక్షణ నటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) ప్రస్తుతం పక్కా ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి రేకెత్తించే రోహిత్, కొంతకాలం విరామం తర్వాత గతేడాది ‘భైరవం’, ‘సుందరకాండ’ చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇక ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులకు ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లతో అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్స్ ఇచ్చారు.
‘కపాలి’గా భయపెట్టేందుకు సిద్ధం!
రామ్ గన్నీ దర్శకత్వంలో నారా రోహిత్ ఒక సరికొత్త కాన్సెప్ట్ చిత్రంలో నటిస్తున్నారు. పురాణాంశాలు, సైకలాజికల్ అంశాలు కలగలిపిన ఒక హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కపాలి’ (Kapali) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రోహిత్ కెరీర్‌లోనే ఇది మొదటి హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ కావడం విశేషం.
‘ఆదర్శ కుటుంబం’లో పవర్‌ఫుల్ పోలీస్!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47’ (Aadarsha Kutumbam: House No.47). ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లో నారా రోహిత్ ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు రోహిత్ బర్త్‌డే కానుకగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఆయన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘సౌండ్ ఇంజినీర్’!
మరోవైపు చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో ఒక యూనిక్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు రోహిత్. ఈ చిత్రానికి ‘సౌండ్ ఇంజినీర్’ (Sound Engineer) అనే విచిత్రమైన టైటిల్‌ను ఫైనల్ చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే ఇదొక అవుట్ అండ్ అవుట్ హ్యూమరస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో రోహిత్ సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, అజయ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.
మొత్తానికి ఒకేరోజు మూడు వైవిధ్యమైన సినిమాల ప్రకటనలతో నారా రోహిత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి గట్టిగా సౌండ్ చేయడానికి సిద్ధమయ్యారు!