సినిమా అవకాశాల కోసం లేదా కెరీర్ పరుగు పందెంలో నేనేమీ తొందరపడటం లేదని అంటోంది అందాల భామ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). ‘ఈశ్వరన్’, ‘భూమి’, ‘కళగ తలైవన్’ వంటి చిత్రాల తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో కనిపించకపోవడానికి కారణం సరైన కథల కోసం వేచి చూడడమేనని ఈ బ్యూటీ స్పష్టం చేసింది.
“నేను దేనికీ హడావుడి పడను!”
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత విషయాలపై నిధి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మంచి విజన్ ఉన్న దర్శకులతో, ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడమే నా లక్ష్యం. తమిళ ఇండస్ట్రీ అలాంటి వైవిధ్యమైన పాత్రలకు నిలయం. నా జీవితంలో ఏ విషయంలోనూ నేను తొందరపడను.. చివరికి పెళ్లి విషయంలో కూడా! నచ్చిన ప్రాజెక్టులు వస్తేనే సంతకం చేస్తాను” అని నిధి తెల్చిచెప్పేసింది.
తన స్వభావం గురించి చెబుతూ.. “నాది చాలా సెన్సిటివ్ మనస్తత్వం, అందుకే నా ఎమోషన్స్‌ని ఎక్కువగా బయటపెట్టను. పని విషయంలో ఎంతో కష్టపడతాను కానీ, మిగతా విషయాల్లో మాత్రం నేను మహా సోమరిని” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.
పెద్ద ప్రాజెక్టులతో బిజీ బిజీ!
ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన నటిస్తుండటంపై స్పందిస్తూ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాల్లో నటించడం తన అదృష్టమని పేర్కొంది. తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే తమిళ సినిమాలకు కాస్త దూరమయ్యానని తెలిపింది.
ప్రస్తుతం రెండు కొత్త సినిమాల కథల చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని చెప్పింది. ఇక ఇవి కాకుండా ‘మిరాయ్’ పార్ట్-2తో పాటు హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఇన్‌ఫ్లుయెన్సర్’ లోనూ నిధి కీలక పాత్రల్లో అలరించబోతోంది.