Find Articles

51 ఏళ్ల వయసులో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ‘గదర్’ బ్యూటీ

‘గదర్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ సొగసరి అమీషా పటేల్ (Ameesha Patel) 51 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి గల అసలు కారణాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

“ఒక్కడి కోసం నా సంతోషాన్ని మార్చుకోలేను!”

ఇటీవల మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అమీషా చాలా ఓపెన్‌గా స్పందించారు. “నన్ను ప్రాణంగా ప్రేమించే కుటుంబం, స్నేహితులు, అభిమానులు వందల సంఖ్యలో ఉన్నారు. వీరి మధ్య నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒక వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించి, ఇప్పుడు ఉన్న ఈ ప్రశాంతమైన జీవితాన్ని, సంతోషాన్ని మార్చుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు” అని సూటిగా తేల్చి చెప్పారు.

“నా డెస్టినీలో రూ.500 కోట్ల సినిమా ఉందేమో!”

ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నా సినిమాలు ఎందుకు తగ్గించేశారు అని మరో అభిమాని ప్రశ్నించగా, తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. “మీ కాంప్లిమెంట్స్‌కి చాలా థాంక్స్. నేను ప్రస్తుతం రూ.50 కోట్లు, రూ.100 కోట్లు లేదా రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే నిర్మాతల బకెట్ లిస్ట్‌లో లేకపోవచ్చు. బహుశా నా డెస్టినీలో రూ.500 కోట్ల భారీ విజయాన్ని సాధించే మరో ధమాకా ప్రాజెక్ట్ ఉందేమో” అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

తనదైన రీతిలో సాగుతున్న ప్రయాణం!

2023లో సన్నీ దేవోల్‌తో కలిసి నటించిన ‘గదర్ 2’ చిత్రంతో అమీషా పటేల్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తారా సింగ్ సరసన సకీనాగా ఆమె చూపించిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, టబు వంటి స్టార్ల బాటలోనే అమీషా కూడా వివాహ బంధానికి దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని స్పాట్‌లైట్‌కు దూరంగా ఉంచుకుంటూ తనకు నచ్చిన రీతిలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

Keerthi