వర్టికల్ స్టోరీస్, యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘దందా’ సిరీస్‌తో విశేష ఆదరణ దక్కించుకున్నారు యంగ్ యాక్టర్ దొర సాయి తేజ. చాయ్ షాట్స్ వేదికగా దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ సక్సెస్ ఊపులో ఉన్న దొర సాయి తేజ తన సినీ ప్రయాణం, కంటెంట్ క్రియేషన్, వ్యాపారం, సోషల్ మీడియా జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ‘దందా’ వరకు..
తన సినీ జర్నీ గురించి చెబుతూ.. “ప్రభాస్ గారి ‘అడవి రాముడు’లో చిన్నప్పటి క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పడంతో నా ప్రయాణం మొదలైంది. ‘కొత్త బంగారు లోకం’, ‘హైస్కూల్’ సిరీస్‌లతో పాటు ‘అలా మొదలైంది’లో చిన్న పాత్ర చేశాను. 2016 నుంచి ఆర్జీవీ గారితో పరిచయం ఏర్పడింది. 2018లో ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీ ప్రారంభించాను. ఇప్పుడు ‘దందా’తో మరో పెద్ద విజయం దక్కింది” అని తెలిపారు.
నటుడు, ప్రొడ్యూసర్, క్రియేటర్.. మల్టీ టాస్కింగ్!
“నిద్ర లేచినప్పటి నుంచి నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవడానికి నిరంతరం ఆలోచిస్తుంటాను. కంటెంట్ క్రియేషన్ అనేది నా బిజినెస్ అయితే, సినిమా అనేది నా ప్యాషన్. నా వయసు కంటే ఐదేళ్లు పెద్దవాడిలానే ఆలోచిస్తాను. ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలనే తపన ఉంటుంది. అందుకే నాకు ఇతర పనులకు లేదా ఎంజాయ్ చేయడానికి టైమ్ ఉండదు” అని వివరించారు.
“కంటెంట్ స్పేస్ అనేది వైకుంఠపాళీ లాంటిది”
సోషల్ మీడియా ప్రమోషన్లు, విమర్శలపై స్పందిస్తూ సాయి తేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫ్లూయెన్సర్ల దుస్తులు, ప్రవర్తన జనంపై చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి వాళ్లు బాధ్యతగా ఉండాలన్నారు. ఈ స్పేస్ వైకుంఠపాళీ లాంటిది. నిచ్చెనెక్కిస్తుంది, తేడా వస్తే కింద పడేస్తుంది. రీచ్ కోసం థంబ్‌నెయిల్స్ మార్ఫ్ చేసి జీవితాలు నాశనం చేసేవాళ్లూ ఉన్నారు. ప్రశంసతో పాటు విమర్శను తట్టుకునేవాళ్లే ఇక్కడ సర్వైవ్ అవుతారని తెలిపారు. “‘దందా’ ప్రమోషన్ కోసం ‘రూ. 15 లక్షలు పోయాయి’ అంటూ చేసిన కాన్సెప్ట్ వీడియో జనాలకు బాగా కనెక్ట్ అయి హిట్ సాధించిందని చెప్పారు.
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ & ఫ్యూచర్ ప్లాన్స్
‘దందా’లో అరవింద్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “ఆర్టిస్ట్‌గా టేక్స్ ఎక్కువైతే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అందుకే సింగిల్ టేక్‌లోనే సీన్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. దర్శకుడు ఆదిత్య విజన్ వల్లే ఈ సిరీస్ 7 రోజుల్లో, 30 కాల్షీట్స్లలో పూర్తయింది. భవిష్యత్తులో సామాన్యుడు రిలేట్ అయ్యే కథలతో, ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే రూపాయికి పూర్తి న్యాయం చేసే పాత్రలే చేస్తాను” అని ముగించారు.