తెలుగు సినీ పరిశ్రమలో తనదైన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ. ‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’ వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో జరిగిన పర్సనల్ మీటింగ్ విశేషాలతో పాటు ఇండస్ట్రీలోని అంతర్గత విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీకేతో అరగంట సీక్రెట్ ముచ్చట!
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అజయ్ స్పందిస్తూ.. ప్రధానమంత్రి మోదీతో పవన్ భేటీ అయిన సందర్భంలో తను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్‌కు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆ వర్క్ చూసి పవన్ స్వయంగా తనను పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు.
“కేవలం ఓ ఐదు నిమిషాలు మాట్లాడి ఫోటో దిగి వచ్చేస్తాననుకున్నా. కానీ, పవన్ గారు నాతో దాదాపు అరగంట పాటు గడిపారు. నా చేతిలో ఉన్న కాఫీ కప్పు లాంటి బోస్ స్పీకర్‌ను చూసి, ‘నా కోసం కాఫీ పట్టుకొచ్చావా?’ అంటూ సరదాగా జోకులు వేశారు. భవిష్యత్తులో పొలిటికల్ ప్రాజెక్ట్‌లతో పాటు ‘పీకే క్రియేటివ్స్’ బ్యానర్లో కూడా కలసి పనిచేద్దామని హామీ ఇచ్చారు” అని అజయ్ సంబరపడిపోయారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, ఏఐ టెక్నాలజీపై ఘాటు వ్యాఖ్యలు
సినిమా రంగంలో బడ్జెట్, ఏఐ (AI) వినియోగంపై అజయ్ అరసాడ సూటిగా స్పందించారు. కెరీర్ ఆరంభంలో అనురాగ్ కులకర్ణితో పాడిస్తానంటే వద్దన్న ఓ నిర్మాత, ఇప్పుడు ఆయన రేంజ్‌కు అనురాగ్‌ను అప్రోచ్ కూడా కాలేని స్థితిలో ఉన్నారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంగీత దర్శకుల ఉపాధికి వచ్చే ముప్పేమీ లేదన్నారు. “కొందరు నిర్మాతలు ఏఐ ట్రాక్స్ పంపి ఇలాగే చేయమంటారు. అలాంటప్పుడు మీరే కొట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఏఐని వాడి ఎవరైనా పని చేయొచ్చు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కాలేరు” అని స్పష్టం చేశారు.
ఓటీటీ వర్సెస్ థియేటర్… క్రెడిట్ వివాదాలు!
థియేటర్ కోసం డిజైన్ చేసిన సౌండింగ్ ఓటీటీకి వచ్చేసరిగా 50 శాతానికి పడిపోతుందనడంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘వికటకవి’ సిరీస్‌ను థియేటర్లో చూస్తే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ వేరే స్థాయిలో ఉండేదని పేర్కొన్నారు.
ఇక క్రెడిట్స్ విషయంలో ‘ఆయ్’ సినిమా సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. రామ్ మిరియాల రెండు పాటలు ఇస్తే, మిగిలిన మొత్తం స్కోర్ తాను చేశానని, కానీ ప్రచారంలో రామ్ మిరియాల పేరే కనిపించడంతో నిర్మాత బన్నీ వాస్ స్వయంగా ప్రతి ఈవెంట్లో తన పేరును హైలైట్ చేసి కరెక్ట్ చేశారని గుర్తుచేసుకున్నారు.
వైజాగ్ నేపథ్యం నుండి వచ్చి, టీసీఎస్‌లో ఏడేళ్ల ఉద్యోగాన్ని వదిలి మ్యూజిక్ వైపు వచ్చిన అజయ్, దేవిశ్రీ ప్రసాద్‌ను తన స్ఫూర్తిగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద కమర్షియల్ సినిమాలకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చే సామర్థ్యం తనకు ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.