Find Articles

సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు ద్వారా వచ్చే లాభాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు వల్ల సమకూరే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని ఆదేశిస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసమే ఈ మొత్తాన్ని సేకరిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఆ నాలుగు పెద్ద సినిమాల నుంచే వసూళ్లు!
ఇటీవల విడుదలైన అలాగే త్వరలో రాబోతున్న భారీ ప్రాజెక్టులైన ‘అఖండ 2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’ చిత్రాల టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన లాభాల నుంచే ఈ 20 శాతాన్ని ఎగ్జిబిటర్ల ద్వారా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్మాతలకు స్పష్టం చేసింది.

కార్మికుల సంక్షేమ ఖాతాల్లోకి నిధులు
ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేసిన ఆ మొత్తాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి సంబంధిత సినిమాల నిర్మాతలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సినిమా రంగంలోని శ్రామికులకు, కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Keerthi