Find Articles

ప్రభాస్ ‘స్పిరిట్’ వాయిదాపై మేకర్స్ సంచలన ప్రకటన.. ఆ తేదీకే వచ్చేస్తున్న రెబల్ స్టార్!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ వాయిదా పడనుందంటూ గడచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎట్టకేలకు స్పందించి ఆ రూమర్లకు గట్టిగా చెక్ పెట్టింది.

అనుకున్న టార్గెట్ మిస్ అవ్వడం లేదు!

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కలయికలో రాబోయే కొత్త సినిమా (SVC63) కూడా అదే సమయానికి విడుదల కానుండటంతో పాటు, ‘స్పిరిట్’ షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానున్నాయని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నింటినీ టీమ్ పూర్తిగా ఖండించింది. “స్పిరిట్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. మేం ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే పర్‌ఫెక్ట్‌గా ముందుకు వెళ్తున్నాం” అని స్పష్టం చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

తొమ్మిది భాషల్లో భారీ ఎత్తున ‘స్పిరిట్’ రచ్చ!

ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కేవలం పోలీస్ కథ మాత్రమే కాకుండా, అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను కూడా డైరెక్టర్ సందీప్ వంగా ఈ చిత్రంలో అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ కథానాయకగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రభాస్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయనున్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Keerthi