Find Articles

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో.. కేటగిరీల వారీగా పరిమితులు ఇవే!

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను ఖరారు చేస్తూ నూతన నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది.

థియేటర్ల వారీగా టికెట్ ధరల వివరాలు

థియేటర్ కేటగిరీ నాన్-ప్రీమియం ధర (రూ.) ప్రీమియం ధర (రూ.)
నాన్ ఏసీ (Non-AC) కనిష్ఠం: ₹30 – గరిష్ఠం: ₹70 కనిష్ఠం: ₹50 – గరిష్ఠం: ₹100
ఏసీ (AC) కనిష్ఠం: ₹50 – గరిష్ఠం: ₹150 కనిష్ఠం: ₹100 – గరిష్ఠం: ₹200
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం: ₹100 – గరిష్ఠం: ₹250 రిక్లయినర్లు: కనిష్ఠం ₹200 – గరిష్ఠం ₹300
మల్టీప్లెక్స్‌లు రెగ్యులర్: కనిష్ఠం ₹100 – గరిష్ఠం ₹250 రిక్లయినర్లు: కనిష్ఠం ₹200 – గరిష్ఠం ₹300

ఉత్తర్వుల్లోని మరికొన్ని కీలక నిబంధనలు

  • స్పెషల్ థియేటర్ అర్హత: 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్, 2K/4K ప్రొజెక్షన్ మరియు కనీసం 75 అడుగుల భారీ స్క్రీన్ ఉన్న థియేటర్లకే స్పెషల్ థియేటర్ హోదా లభిస్తుంది.
  • ఐదు షోలకు పర్మిషన్: ఉదయం 8:00 గంటల నుంచి అర్ధరాత్రి 1:00 గంటల మధ్య ప్రతి థియేటర్‌లో 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
  • చిన్న సినిమాలకు ప్రాధాన్యం: ఉదయం 11:00 నుండి రాత్రి 9:00 గంటల మధ్య ఒక షో తప్పనిసరిగా చిన్న సినిమాకే కేటాయించాలి. అంతేకాకుండా పండుగల సమయంలోనూ పరిమిత బడ్జెట్ సినిమాలకు ప్రాధాన్యమివ్వాలి.
  • సూపర్ హై బడ్జెట్ సినిమాలు & ధరల పెంపు: ₹100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలను ‘సూపర్ హై బడ్జెట్ చిత్రాలు’గా గుర్తిస్తారు. వీటికి మొదటి 10 రోజుల పాటు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంది.
  • కార్మిక సంక్షేమ నిధి: టికెట్ ధరల పెంపు పొందాలంటే సినీ కార్మిక సంక్షేమ నిధికి ₹1 కోటి విరాళం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
  • సామాన్యులకు కేటాయింపు: పేద, మధ్య తరగతి ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రతీ థియేటర్‌లో (మల్టీప్లెక్స్‌లతో సహా) 25% సీట్లను కేటాయించాలి.
  • ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు: ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి ఏసీ థియేటర్లకు ₹5, నాన్ ఏసీ థియేటర్లకు ₹3 మెయింటెనెన్స్ ఛార్జీలుగా నిర్ణయించారు.
  • ఏసీగా అప్‌గ్రేడేషన్: ప్రస్తుతం ఎయిర్ కూల్డ్ ఉన్న థియేటర్లను రాబోయే రెండేళ్ల వ్యవధిలో ఏసీ థియేటర్లుగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Keerthi