Find Articles

‘నాకు ఇల్లంటే నువ్వే’: కావ్య కల్యాణ్‌రామ్‌తో ప్రేమను బయటపెట్టిన చేసిన కాలభైరవ!

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు కాలభైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్ కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు దంపతులుగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కావ్యతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, లోతైన ప్రేమను వ్యక్తపరుస్తూ కాలభైరవ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భావోద్వేగ ప్రేమలేఖ నెట్టింట తీవ్ర వైరల్ అవుతోంది.

చలికాలపు కాఫీ లాంటి సాంత్వన..!

కావ్యతో గడిపిన ప్రతి క్షణాన్ని ప్రకృతి అందాలతో పోలుస్తూ కాలభైరవ ఎంతో కవితాత్మకంగా తన మనసులోని మాటలను రాసుకొచ్చారు.

“నీతో గడిపే సమయం పచ్చని పర్వతాల మధ్య కూర్చొని జలపాతం సవ్వడులను ఆస్వాదిస్తున్నంత ప్రశాంతంగా ఉంటుంది. నీతో కలిసి చేసే ఏ చిన్న పనైనా ముగిసిపోకూడదనుకునే ఒక అందమైన ప్రయాణంలా అనిపిస్తుంది. చలికాలపు ఉదయాన మనకిష్టమైన వేడి కాఫీ తాగుతుంటే ఎంతటి హాయి లభిస్తుందో, నీతో మాట్లాడే ప్రతి మాట నా మనసుకు అంతే సాంత్వననిస్తుంది” అంటూ ప్రేమానుభూతిని వ్యక్తం చేశారు.

‘హోమ్’ అంటే కేవలం నాలుగు గోడలు కావు!

మొదట్లో ఈ అనుభూతికి ఎలాంటి పేరు పెట్టాలో తెలియలేదని, కానీ కాలక్రమంలో ఇది సాధారణ ఆకర్షణ కాదని అర్థమైందని కాలభైరవ పేర్కొన్నారు.

“ఈ ప్రయాణంలో నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ భావనలన్నింటికీ ఉన్న ఏకైక రూపం ‘ఇల్లు’ (Home). నిన్ను మొదటిసారి కలిసినప్పుడు ఏనాడో వెతుక్కుంటున్న నా సొంత గూటికి చేరిన భావన కలిగింది. ఆ క్షణం నుంచి నేను ఆ గూటిని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. జీవితాంతం ఒకరికొకరం గూడై, ఒకరికొకరం అండగా నిలవబోతున్నామనే విషయాన్ని అందరితో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని ముగించారు.

నెట్టింట వేల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కాలభైరవ, ‘మసూద’, ‘బలగం’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా మెప్పించిన కావ్య కల్యాణ్‌రామ్ త్వరలోనే ఒక్కటి కాబోతుండటంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమని ఇంత సున్నితంగా, కవితాత్మకంగా వ్యక్తపరచడం కాలభైరవకే సాధ్యమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Keerthi