‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న లేటెస్ట్ రూరల్ కమర్షియల్ డ్రామా ‘వేట’. ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ (ETV Win) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కోటిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం (ఆగస్ట్ 31) నాడు సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి.
ముహూర్తపు వేడుకకు తరలివచ్చిన టాలీవుడ్ ప్రముఖులు!
ఈ ప్రారంభోత్సవ వేడుకకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తపు షాట్‌కు నాగబాబు స్క్రిప్ట్ అందించగా, దిగ్గజ దర్శకుడు-నటుడు కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, నిర్మాత ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
సందీప్ సరోజ్ & కేఎస్ రవి కుమార్ కామెంట్స్!
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారి ఐకానిక్ టైటిల్ ‘వేట’ మా కథకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ లాగే ఈ చిత్రాన్ని కూడా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆయన మాట్లాడుతూ.. “దర్శకుడు అశోక్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశాను. ఈ చిత్రంలో ఊరి పెద్ద (‘పెదరాయుడు’ టైప్) పాత్రలో కనిపిస్తాను. నేటి జెన్-జీ (Gen-Z) ఆడియెన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నాచురల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్!
ఈటీవీ విన్‌తో కలిసి ప్లాన్ చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది అని, ‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలోనే గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజంగా ఉంటూనే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం అలరిస్తుందని నిర్మాత ఫణి అడపాక పేర్కొన్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రఘు బాబు, రవీంద్ర విజయ్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.