మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ గురించి టాలీవుడ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొద్దిరోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావించినా కానీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కారణంగా సమ్మర్ రిలీజ్ సాధ్యపడలేదు. ఆ తర్వాత మేకర్స్ జులై 10ని టార్గెట్ డేట్‌గా అనుకున్నా అదే సమయంలో చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా జూన్ 25 న అని ముందు భావించడంతో కొంత డైలమా నెలకొంది.
అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, జులై 10న ‘విశ్వంభర’ విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి. ముఖ్యంగా ‘పెద్ది’ విడుదల తేదీ జూన్ 4కి మారడంతో చిరంజీవి మూవీకి రూట్ క్లియర్ అయ్యింది. సోలో రిలీజ్ దొరికితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రిలీజ్ డేట్ విషయంలో అడ్డంకులు లేనప్పటికీ, ఇప్పుడు అందరి దృష్టి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల పైనే ఉంది. జులై నాటికి క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి సినిమాను రెడీ చేస్తారా అన్నది వేచి చూడాలి. అదే గనుక జరిగితే, జులై 10న థియేటర్లలో మెగా జాతర మొదలైనట్లే!