Find Articles

“కులపిచ్చి” బయటపెట్టిన  మహేష్ విట్టా

సినీ ఇండస్ట్రీ అంటే గ్లామర్, రంగుల ప్రపంచం అని అందరూ అనుకుంటారు కానీ ఆ రంగుల వెనుక కులం, గ్రూపిజం అనే బలమైన పునాదులు ఉన్నాయనే చేదు నిజాన్ని తాజాగా నటుడు మహేష్ విట్టా కుండబద్దలు కొట్టారు. ప్రతిభ ఉన్నా కేవలం ‘మనకి కావలసిన కులం’ కాదనే కారణంతో తనను సినిమాల నుండి తప్పించారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వూలో మహేష్ విట్టా తన ఆవేదనను పంచుకుంటూ.. “నేను ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్ట్ అయ్యాను. షూటింగ్ డేట్స్ కూడా ఫైనల్ అయ్యేవి. కానీ చివరి నిమిషంలో నాకు ఫోన్లు రావడం ఆగిపోయేవి. తీరా చూస్తే ఆ ప్లేస్‌లోకి వేరే నటుడు వచ్చేసేవాడు. మొదట్లో ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు” అని చెప్పుకొచ్చారు.

అయితే సినిమా నుంచి తనను ఎందుకు తీసేశారని ఆరా తీయగా తెలిసిన నిజం చూసి మహేష్ విట్టా షాక్‌కు గురయ్యారు.

“నన్ను రీప్లేస్ చేసిన వ్యక్తి సదరు ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ సామాజిక వర్గానికి (కులానికి) చెందినవాడు కావడమే దానికి కారణం. టాలెంట్ ఉన్నా కూడా ‘మా వాడు కాదు’ అనే కారణంతో అవకాశాలు దూరం చేయడం నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఫేమ్ తెచ్చుకున్న మహేష్ తదనంతర కాలంలో బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఆయనకు అనుకున్న స్థాయిలో బ్రేక్ రాలేదు.

Keerthi