Find Articles

ఇంకోసారి ఇలాంటి సినిమా చేయను: సుహాస్‌

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్, తమిళ విలక్షణ నటుడు సూరి కలసి నటిస్తున్న క్రేజీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ (Mandaadi). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం సెప్టెంబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో సుహాస్ ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో తమకు ఎదురైన ప్రాణాపాయ పరిస్థితుల గురించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

జీవితం విలువ తెలిసొచ్చింది: సుహాస్ ఎమోషనల్!

సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ అనుభవాలను పంచుకుంటూ సుహాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సముద్రంలో షూటింగ్ చేస్తుంటే నాకు తీవ్రమైన భయం వేసింది. నిజంగా ఆ టైమ్‌లోనే జీవితమంటే ఏంటో అర్థమైంది. షూట్ పూర్తయ్యాక సముద్రానికి దండం పెట్టి.. ‘నన్ను ప్రాణాలతో బతికించి బయటకు పంపినందుకు థాంక్స్’ అని అనుకున్నాను. నాకే కాదు, మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ ఇదే అనుభవం ఎదురైంది. షూటింగ్ సమయంలో మూడునాలుగుసార్లు మేమంతా చనిపోయి బతికిపోయాం అనుకున్న క్షణాలు ఉన్నాయి” అని తెలిపారు.

తిరగబడ్డ బోట్లు.. నీళ్లలో పడిపోయిన కెమెరామెన్లు!

సముద్రపు అలల తీవ్రతకు ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యాయో వివరిస్తూ.. “షూటింగ్ సమయంలో బోట్లు తిరగబడేంత పని అయింది. టీమ్ సభ్యులమంతా నీళ్లలో పడిపోయాం. కెమెరామెన్లు కూడా సముద్రంలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదే అత్యంత రిస్క్‌తో కూడుకున్న ప్రాజెక్ట్. భవిష్యత్తులో మళ్లీ ఇంత రిస్క్ ఉన్న సినిమా చేయను. ఎందుకంటే అన్నింటికంటే మన ప్రాణమే ముఖ్యం కదా!” అని సుహాస్ స్పష్టం చేశారు.

45 రోజుల క్లైమాక్స్ రచ్చ.. ఫోన్లు పని చేయలేదు!

అన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లామని సుహాస్ పేర్కొన్నారు. “కథ చాలా అద్భుతంగా ఉంది. నిర్మాతలు మనల్ని నమ్మి కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మనం కూడా ప్రాణం పెట్టి పని చేయాలని మొండిగా ముందుకు పోయాం. ఏకంగా 45 రోజుల పాటు సముద్రంలోనే ఉండి క్లైమాక్స్ అంతా షూట్ చేశాం. అక్కడ సిగ్నల్స్ ఉండవు, ఫోన్లు పని చేయవు. బ్రేక్ టైమ్‌లో బోట్‌లో ఉన్న వారితో మాట్లాడుతూ సమయం గడిపాం. ఆ 45 రోజుల షెడ్యూల్ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. జీవితంలో భయమనేది పోయింది” అని చెప్పుకొచ్చారు.

ఇక తమిళ నటుడు సూరి గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా సరదా మనిషి అని, సెట్స్‌లో ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ ఎంతో ఆప్యాయంగా కలిసిపోతారని సుహాస్ కొనియాడారు. సముద్రంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి తీసిన ఈ ‘మండాడి’ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి!

Keerthi