ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’ (Raaka). ఈ డ్రీమ్ ప్రాజెక్టులో నటించే ఒక అద్భుతమైన అవకాశాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) వదులుకుందంటూ గతంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రేజీ రూమర్లపై దర్శకుడు అట్లీ తాజాగా స్పందిస్తూ అసలు నిజాలను బయటపెట్టారు. ప్రీతి ముకుందన్ నటించిన తాజా తమిళ రొమాంటిక్ కామెడీ ‘హృదయం మురళి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న అట్లీ.. ఈ లీక్ ఇచ్చారు.
ఆమె నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని: అట్లీ
“నేను వ్యక్తిగతంగా ప్రీతి ముకుందన్ నటనకు చాలా పెద్ద అభిమానిని. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రాకా’ సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం మొదట ఆమెనే సంప్రదించాను. అయితే అప్పటికే ఆమె చేతినిండా ప్రాజెక్టులతో విపరీతమైన బిజీగా ఉండటం వల్ల మా సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. ఆ డేట్ల సమస్య కారణం వల్లే ఆమె ఈ క్రేజీ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చింది తప్ప మరేమీ లేదు” అని అట్లీ క్లారిటీ ఇచ్చారు.
ప్రీతి ప్లేస్‌లోకి మలయాళ క్రేజీ హీరోయిన్!
ప్రీతి ముకుందన్ రిజెక్ట్ చేసిన ఆ పవర్‌ఫుల్ రోల్‌ను మేకర్స్ ఎవరికి ఇచ్చారనే సస్పెన్స్‌కు కూడా అట్లీ తెరదించారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫెమినా జార్జ్ (Femina George)ను ఆ పాత్ర కోసం ఫైనల్ చేసినట్లు అట్లీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. అయితే, అల్లు అర్జున్ సినిమాలో ఆమె చేయబోయే క్యారెక్టర్ ఎలాంటిదనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.
మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రీతి ముకుందన్.. రీసెంట్‌గా ‘బ్లాస్ట్ జోన్’ (Blast Zone) సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన తమిళ చిత్రం ‘హృదయం మురళి’ జులై 10న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ లోపు అట్లీ స్వయంగా ‘రాకా’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.