టాలెంటెడ్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి (BV Nandini Reddy) దర్శకత్వంలో సమంత (Samanthaమ) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన భారీ విజయంతో నందిని రెడ్డి పేరు ఇప్పుడు నేషనల్ లెవెల్లో మారుమోగుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ నుండి వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నందిని రెడ్డి తన హిందీ ఎంట్రీతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
భాష ఏదైనా కథే ముఖ్యం: బి.వి. నందిని రెడ్డి
“నేను నా చదువు కోసం రెండేళ్ల పాటు ఢిల్లీలో ఉన్నాను. ఆ సమయంలో విపరీతంగా హిందీ సినిమాలు చూసేదాన్ని. కాబట్టి హిందీ సినిమా చేయడం నాకు కొత్తేమీ కాదు. ఒక మంచి బలమైన కథ కుదిరితే కచ్చితంగా బాలీవుడ్లో సినిమా చేస్తాను. అసలు ఏ భాషలో చెప్పినా అది కథే కదా, దానికి ఎల్లలు లేవు. త్వరలోనే హిందీ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది” అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.
రూట్ మార్చిన డైరెక్టర్.. అక్టోబర్ నుంచే ఓటీటీలో డార్క్ మిస్టరీ!
ఇప్పటివరకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లైట్ హార్టెడ్ సినిమాలతో మెప్పించిన నందిని రెడ్డి.. ఈసారి డిజిటల్ స్క్రీన్‌పై పూర్తిగా రూట్ మార్చబోతున్నారు. ఓటీటీ వేదికగా ఒక విభిన్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
ఓటీటీ లైనప్: “త్వరలోనే నేను ఒక సరికొత్త డార్క్ సూపర్‌నేచురల్ (Dark Supernatural) వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాను. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు నేను చేసిన శైలికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది.”
ఇక తన తదుపరి భారీ థియేట్రికల్ సినిమా మాత్రం 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఈ క్రేజీ లేడీ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఒకపక్క ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే.. మరోపక్క డార్క్ థ్రిల్లర్ సిరీస్, బాలీవుడ్ ఎంట్రీలతో నందిని రెడ్డి ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ డైరెక్టర్‌గా మారిపోయారు.