Find Articles

‘జన నాయగన్’ లీక్ వెనుక విజయ్ పొలిటికల్ గిమిక్?

కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతున్న కొద్దీ తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో లీక్ కావడం, దానిపై పలు రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తడం తమిళ చిత్రసీమలో తీవ్ర కలకలం రేపింది. రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ రాజకీయ లబ్ధి పొందడానికే ఈ చిత్రాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా లీక్ చేయించారంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు హెచ్. వినోద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజకీయ కోణంలోనే అసత్య ప్రచారాలు!

జులై 23న ప్రపంచవ్యాప్తంగా ‘జన నాయగన్’ గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన వినోద్, ఈ లీకేజీ ఆరోపణలను ఖండించారు. “వందల కోట్ల భారీ బడ్జెట్‌తో, ఎంతోమంది శ్రమతో నిర్మించిన ఒక సినిమాను మేకర్స్ కావాలని ఎందుకు లీక్ చేస్తారు? ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తే కొద్ది గంటల్లోనే అధికారులకు తెలిసిపోతుంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికే ఈ కుట్రలను అర్థం చేసుకున్నారు” అని ఆయన స్పష్టం చేశారు.

విజయ్ స్పందించకపోవడానికి కారణం అదే!

ఈ లీక్ వ్యవహారంపై విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.. విజయ్ ఆ సమయంలో స్పందించి ఉన్నా దానిపై మళ్ళీ కొత్త విమర్శలు తెచ్చిపెట్టేవారని తెలిపారు. ఇప్పటికే నిర్మాతలు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇక సినిమా విడుదల వాయిదా పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “గడిచిన ఆరు నెలలు మాకు ఎంతో కష్టంగా గడిచాయి. తీవ్ర మనోవేదనకు గురయ్యాం. కానీ, మా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు థియేటర్లలో ఇస్తారనే నమ్మకం మాకుంది” అని వినోద్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Keerthi