Find Articles

కళ్యాణి మాలిక్ ‘ది నైట్ ఆఫ్ ది స్టార్స్’తో మ్యూజికల్ సునామీ

హైదరాబాద్ సంగీత ప్రియులకు పండుగలాంటి వార్త! మెలోడీల రారాజు, ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యాజిక్‌ను లైవ్ స్టేజ్ మీద చూపించబోతున్నారు. సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ‘అసెంబ్లీ’ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” కోసం నగరం ఆతృతగా ఎదురుచూస్తోంది. నిర్వాహకుడు, పాపులర్ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ, “మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మధురమైన పాటలను, ఆ నోస్టాల్జిక్ జ్ఞాపకాలను మరోసారి లైవ్ పర్ఫార్మెన్స్‌లో ప్రేక్షకులకు అందించాలనేదే మా ముఖ్య ఉద్దేశ్యం. దాదాపు 23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ గారి సారథ్యంలో ఇటువంటి గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగడం మాకు ఎంతో గర్వకారణం” అని తెలిపారు.

ఈ మ్యూజికల్ నైట్‌లో కళ్యాణి మాలిక్ సంగీత దర్శకత్వంలో తన గళాన్ని వినిపించడానికి గీతా మాధురి సిద్ధమయ్యారు. వీరితో పాటు సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి, భార్గవి వంటి అద్భుతమైన గాయనీ గాయకులు వేదికపై తమ గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. ఈ షో గురించి కళ్యాణి మాలిక్ స్పందిస్తూ, “నా మొదటి సినిమా ‘ఐతే’ విడుదలైనప్పుడు ఎంతటి ఉత్సాహంతో ఉన్నానో, ఇప్పుడు ఈ మ్యూజికల్ షో నిర్వహిస్తున్నప్పుడు కూడా సరిగ్గా అదే అనుభూతి కలుగుతోంది. సింగర్స్ అందరితో కలిసి పాత మధురాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నాను” అని తన మనోభావాలను పంచుకున్నారు.

ఈ సంగీత సాయంత్రాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించడానికి సంగీత ప్రియులు ‘డిస్ట్రిక్ట్ యాప్’ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే నిర్వాహకులు సోషల్ మీడియాలో మరియు ఫోన్ నంబర్ల ద్వారా అందుబాటులో ఉంచిన వివరాలతో కూడా టికెట్లను పొందవచ్చు. హైదరాబాద్‌లో జరగబోయే ఈ అద్భుతమైన మ్యూజికల్ ఈవెంట్, ఈ సీజన్ లోనే అత్యంత గుర్తుండిపోయే ప్రదర్శనగా నిలవబోతోందని ఆర్గనైజర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 12న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ‘అసెంబ్లీ’ వేదిక సంగీత సుధలతో మార్మోగనుంది. మీరు కూడా సిద్ధమేనా?

Keerthi