ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చేలా ప్రశాంత్ నీల్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నట్లుగానే, ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సరిపెట్టకుండా, ఏకంగా నాలుగు నిమిషాల నిడివి గల ఒక సాలిడ్ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రశాంత్ నీల్ అనగానే మనకు గుర్తొచ్చేది ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల్లోని డార్క్ థీమ్, ఎలివేషన్లు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా అదే స్థాయి ఇంటెన్సిటీని నీల్ సిద్ధం చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ నాలుగు నిమిషాల వీడియో సినిమా కథాంశం మరియు ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో స్పష్టమైన హింట్ ఇచ్చింది.
ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ గ్లింప్స్ ను కట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాపై అంచనాలను అకాశానికి తీసుకెళ్లాయి. నిజానికి ఈ క్రేజీ కాంబో మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ చివర్లో సినిమా విడుదలకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తారక్ పుట్టినరోజు నాడు విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.