మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ హద్దులు దాటి బాలీవుడ్ అంచనాలను మించిపోతోంది. గ్లోబల్ స్టార్‌గా వెలుగుతున్న చరణ్, తన తదుపరి చిత్రం పెద్దితో ఉత్తరాది మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడయ్యాయని, ఇది ఇటీవల భారీ విజయం సాధించిన ధురంధర్ సినిమా రికార్డులను కూడా అధిగమించిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘RRR’ తర్వాత రామ్ చరణ్ కి హిందీ బెల్ట్‌లో ఏర్పడిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి. ‘ధురంధర్’ సినిమా హిందీ శాటిలైట్ మరియు డిజిటల్ బిజినెస్ పరంగా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ‘పెద్ది’ ఆ మార్కును చాలా సునాయాసంగా దాటేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రముఖ సంస్థ జియో స్టూడియోస్ ‘పెద్ది’ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది. ఈ డీల్ వాల్యూ ఎంత అన్నది అధికారికంగా ప్రకటించకపోయినా, ఇప్పటివరకు ఒక సౌత్ ఇండియన్ సినిమా హిందీ శాటిలైట్ హక్కుల పరంగా చూస్తే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది. కేవలం శాటిలైట్ మాత్రమే కాకుండా, నాన్-థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ చరణ్ సినిమా సంచలనం సృష్టిస్తోంది.
రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిస్థాయి రస్టిక్ లుక్‌లో, ఒక మట్టి మనిషిగా కనిపించబోతున్నారు. 1980ల నాటి నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, కేవలం కథా బలంతోనే కాకుండా చరణ్ పర్ఫార్మెన్స్తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ‘పెద్ది’ సృష్టించిన ఈ శాటిలైట్ సునామీ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద కూడా మరిన్ని కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమనిపిస్తోంది.