Find Articles

గూస్ బంప్స్ తెప్పిస్తున్న అమరం టీజర్.. సింగిల్ టేక్‌లో హీరో స్టంట్!

టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ విందును అందించేందుకు సిద్ధమైంది అమరం. తేజేష్ రాజన్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్, తన ఇంటెన్స్ విజువల్స్,  పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. తూర్పు కనుమల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలిని, వారు ఎదుర్కొనే ప్రాణాపాయాలను అత్యంత సహజంగా చూపించారు.

ఒక ట్రైబల్ స్మగ్లర్, ఒక కిల్లర్, ఒక యువతి మధ్య సాగే ఉత్కంఠభరిత ప్రయాణమే ఈ ‘అమరం’.  కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలోని సామాజిక సమస్యలను కూడా దర్శకుడు బలంగా స్పృశించారు. కడప పరిసరాల్లో భారీ సెట్లు వేయడమే కాకుండా, వెస్ట్రన్ ఘాట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో యాక్షన్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బాంబేకు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో కలిసి స్టంట్ మాస్టర్ మిరాకిల్ మైఖేల్ మూడు భారీ యాక్షన్ ఘట్టాలను రూపొందించారు.

> “డాల్ఫిన్ నోస్ వంటి ప్రమాదకరమైన లోయ అంచున హీరో తేజేష్ రాజన్ ఒక కీలక యాక్షన్ సీన్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.”

దాదాపు 200 మంది ఫైటర్లతో చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఒక లోతైన ప్రేమకథకు, పరిస్థితుల ప్రభావంతో వచ్చే యాక్షన్‌ను జోడించి ఈ చిత్రాన్ని మలిచారు. సాలిడ్ కాస్టింగ్
దర్శకుడు తిరువరుల్ కృష్ణన్ గతంలో రాఘవ లారెన్స్ వద్ద పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కేరళకు చెందిన 60 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించిన ఫోక్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ‘వడచెన్నై’, ‘అసురన్’ వంటి క్లాసిక్ చిత్రాలకు పనిచేసిన రామర్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించడం విశేషం.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించగా.. నాగినీడు, సాయి ధీనా, జార్జ్ మరియన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఒక జంట ఎదుర్కొనే సవాళ్లు, వారి ప్రయాణంలో ఎదురయ్యే మలుపులతో ‘అమరం’ వెండితెరపై ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. టీజర్ చూస్తుంటే ఇది కేవలం స్మగ్లింగ్ డ్రామా మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ రైడ్ అని స్పష్టమవుతోంది.

Keerthi