పాపులర్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న మైండ్-గేమ్ రియాలిటీ షో ‘ది ట్రేటర్స్ తెలుగు’ (The Traitors Telugu) రోజురోజుకూ మునుపటి కంటే మరింత రసవత్తరంగా మారుతోంది. రోజుకో కొత్త వివాదంతో రాజుకుంటున్న ఈ షోలో తాజాగా ఓ చిన్న హెయిర్ క్లిప్ వ్యవహారం బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద ఊహించని పెద్ద గొడవకు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద రచ్చ:
ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రస్తుతం నెట్టింట షో వీక్షకుల్లో వివాదాస్పదంగా మారిన ప్రధాన అంశం ఏమిటంటే.. నటి వర్షా డిసౌజా (Varsha D’souza)కు చెందిన ఒక హెయిర్ క్లిప్‌ను ఉద్దేశించి శ్రీదేవి చౌదరి (Sreedevi Chowdary) చేసిన ‘చీప్’, ‘మిడిల్ క్లాస్’ అనే ఘాటు వ్యాఖ్యలే! కంటెస్టెంట్లందరూ ప్రశాంతంగా ఉదయం అల్పాహారం తింటున్న సమయంలో, రాహత్ అచంటా వద్ద మెరుస్తున్న ఒక హెయిర్ క్లిప్‌ను శ్రీదేవి చౌదరి గమనించారు. వెంటనే ఆమె జోక్యం చేసుకుంటూ.. “ఈ వెగటుగా (Tacky) ఉన్న క్లిప్ ఇక్కడ ఎందుకుంది? అసలు ఇది ఎవరిది?” అని ప్రశ్నించారు. వర్షా డిసౌజా తనను కొద్దిసేపు పట్టుకోమని ఇచ్చిందని రాహత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ శ్రీదేవి తగ్గలేదు.
ఆ క్లిప్‌ను చూడగానే ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది చాలా “చీప్” (Cheap) గా, “మిడిల్ క్లాస్” (Middle-Class) తరహాలో ఉందని, వెంటనే దానిని వర్షాకు తిరిగి ఇచ్చేయాలని రాహత్‌ను ఆదేశించారు.
హౌస్‌లో పెరిగిన ఉద్రిక్తత:
కేవలం ఒక సాధారణ హెయిర్ క్లిప్ విషయంలో శ్రీదేవి చౌదరి అంతలా స్పందించి ‘మిడిల్ క్లాస్’ అని వ్యాఖ్యానించడం బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద ఉన్న తోటి పోటీదారులలో అత్యంత అసౌకర్య వాతావరణాన్ని (Awkward Moment) సృష్టించింది. హౌస్‌లో ఇప్పటికే ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ, మైండ్ గేమ్‌లు నడుస్తుండగా.. శ్రీదేవి చేసిన ఈ వర్గ పోలికల వ్యాఖ్యలు వర్షా డిసౌజాతో ఎలాంటి శత్రుత్వానికి దారితీస్తాయోనని వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ఎస్ఓఎల్ ప్రొడక్షన్’ (SOL Production) అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ సెట్టింగ్‌లో నిర్మించిన ఈ రియాలిటీ షో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు అందుబాటులోకి వస్తుండగా, ఈ ‘క్లిప్ వివాదం’ హౌస్‌లోని ఆటగాళ్ల సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి!