Find Articles

విజయ్‌కు గవర్నర్ బ్రేక్.. తెరపైకి క్యాంప్ పాలిటిక్స్.. టీవీకే ముందు వీసీకే భారీ డిమాండ్లు!

తమిళనాడు సినిమాల కంటే రాజకీయాల్లో అసలు సిసలైన పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తోంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో.. రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. మెజారిటీ నిరూపించుకునే క్రమంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పొత్తుల ఎత్తుగడలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు టీవీకే (TVK) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో విజయ్ పార్టీ బలం ప్రస్తుతం 116కు చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉండటంతో టీవీకే అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. అయితే, మంత్రి పదవులు ఆశించడం లేదని, ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతు ఇస్తామని వామపక్షాలు స్పష్టం చేశాయి. కానీ, అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) చివరి నిమిషంలో టీవీకేకి హ్యాండ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ గందరగోళ పరిణామాల మధ్య విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ మరోసారి ససేమిరా అన్నారు.

రాజకీయ సంక్షోభం, ప్రలోభాల పర్వం నేపథ్యంలో తమిళనాట ‘క్యాంప్ రాజకీయాలు’ మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించింది. వీరు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే బస చేయనున్నట్లు సమాచారం. మరోవైపు టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) భారీ డిమాండ్లను తెరపైకి తెచ్చింది. చెన్నైలోని వీసీకే ఆఫీసులో పార్టీ నేతలతో తిరుమావళవన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టీవీకేకి మద్దతు ఇవ్వాలంటే.. డిప్యూటీ సీఎం పోస్ట్, తిరుచ్చి సీటుతో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కీలక పదవి ఇవ్వాలని మూడు ప్రధాన షరతులు ఉంచినట్లు తెలుస్తోంది. దీనిపై వీసీకే నేడు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. క్షణక్షణం మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలతో తమిళనాట ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను విజయ్ ఎలా ఆకర్షిస్తారు? వీసీకే డిమాండ్లకు టీవీకే తలొగ్గుతుందా? అన్నది రానున్న కొద్ది గంటల్లో తేలనుంది.

Keerthi