Find Articles

కల్యాణ్ బాబును చూస్తుంటే గర్వంగా ఉంది: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తన తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి రాసుకొచ్చిన మాటలు మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చిన్నప్పటి నుంచే ఆ నిబద్ధత!
పవన్ కల్యాణ్‌ను ‘సంకల్ప సాధకుడు’గా అభివర్ణించిన చిరంజీవి, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. “నిబద్ధత, బాధ్యత, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కల్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమాభిమానాలు చూపిస్తాడు” అని చిరంజీవి పేర్కొన్నారు.

పిఠాపురం ప్రజలకు కుటుంబ సభ్యుడిలా!
తనను నమ్మి గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని మెగాస్టార్ ప్రశంసించారు.

ఆనందంగా, గర్వంగా ఉంది!
“ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో క్లిష్టమైన సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి వైపు నడిపిస్తున్న పవన్‌ను చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కల్యాణ్ బాబు వేసే ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

https://www.instagram.com/p/DcxZcBrn85k/?utm_source=ig_web_button_share_sheet

Keerthi