Find Articles

తెలుగు దర్శకులకు అల్లు అర్జున్ హ్యాండ్.. అసలు ప్లాన్ అదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా మలుచుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న బన్నీ, ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ‘రాకా’ అనే భారీ యాక్షన్ చిత్రం చేస్తున్న బన్నీ, ఆ తర్వాత కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను శాసించేలా తన లైనప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.

అన్యభాషల దర్శకులతో బన్నీ మాసివ్ ప్లానింగ్!
గమనించాల్సిన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్ డైరెక్టర్లవే కావడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కోలీవుడ్ నుంచి అట్లీతో పాటు, లోకేష్ కనగరాజ్‌తో ప్రాజెక్టులు ఖరారయ్యాయి. మలయాళంలో ‘మిన్నల్ మురళీ’ ఫేమ్ బాసిల్ జోసెఫ్‌తో సినిమా అనధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఇక కన్నడ, హిందీ భాషల దర్శకులతో కూడా బన్నీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో భాషలో ఒక్కో టాప్ డైరెక్టర్‌ను పట్టుకుని తన మార్కెట్‌ను విస్తరించుకోవడమే బన్నీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

టాలీవుడ్ దర్శకులకు నో ఛాన్స్? సందీప్ వంగే ఏకైక ఆశ!
ఈ క్రమంలో అల్లు అర్జున్ తెలుగు దర్శకులకు క్రమంగా దూరమవుతున్నారా? అన్న ప్రశ్న అభిమానుల మెదళ్లలో మెదులుతోంది. ‘పుష్ప’ కోసం సుకుమార్‌తో ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ, కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగు దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ పేరు మాత్రమే బన్నీ లిస్టులో బలంగా వినిపిస్తోంది. సందీప్ మినహా, మరో తెలుగు దర్శకుడితో బన్నీ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న బన్నీ, ఇతర భాషల స్టార్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపడం సహజమే అయినా, టాలీవుడ్ లోని సెన్సేషనల్ డైరెక్టర్లను ఆయన పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భవిష్యత్తులో బన్నీ మన తెలుగు దర్శకులకు ఎప్పుడు అవకాశం ఇస్తారు? లేక పూర్తిగా పాన్ ఇండియా దర్శకులకే పరిమితం అవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Keerthi