Find Articles

సీన్ రివర్స్.. చిరు ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరో కొత్త ప్రస్థానం మొదలైంది. దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రం  అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం, ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ అద్భుత ఘట్టం చిరంజీవిని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. సినిమా ముహూర్తం సందర్భంగా అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ చిరంజీవి పంచుకున్న పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

తన పోస్ట్‌లో చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ క్లాప్ ఇస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జరిగిన ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమా సందర్భం కళ్లముందు కదలాడుతోందని చిరంజీవి పేర్కొన్నారు. అప్పట్లో తమ్ముడి సినీ ప్రస్థానానికి తాను దన్నుగా ఉంటే… ఈరోజు అన్నయ్య సినిమా కోసం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి క్లాప్ కొట్టడం ఆయనకు ఎంతో గర్వకారణంగా అనిపించింది.

రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన 158వ సినిమా ముహూర్తం కోసం సమయం కేటాయించిన పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. పవన్ రాకతో చిత్ర యూనిట్ సభ్యులందరిలో కొత్త ఉత్సాహం నిండిందని, ఈ సందర్భం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. “Love you Kalyan” అంటూ పవన్ పట్ల తనకున్న అమితమైన ప్రేమను, గౌరవాన్ని చిరంజీవి మరోసారి చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ ఆత్మీయతను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Keerthi