Find Articles

సినీ రంగంలో చెరగని సంతకం: తెలుగు పత్రికా రంగానికి బీఏ ‘రాజు’ అందించిన వైభవం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పేరు వినగానే క్రమశిక్షణ, అంకితభావం, సినిమాపై ఉన్న గాఢమైన ప్రేమ గుర్తుకు వస్తాయి. ఆ పేరే బీఏ రాజు. మే 21, అంటే నేడు ఆయన ఐదవ వర్ధంతి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో పాత్రికేయుడిగా, పీఆర్ఓగా, నిర్మాతగా ఆయన వేసిన ముద్ర తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ చెరగనిది.

సినీ పరిశ్రమలో ఒక వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి, సంస్థగా ఎదిగిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి పీఆర్ఓగా తన వృత్తిని ప్రారంభించి, ప్రచార రంగానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. కేవలం పీఆర్ఓకే పరిమితం కాకుండా, ‘సూపర్ హిట్’ పత్రికను అత్యంత విజయవంతంగా నడిపిస్తూ, ఎంతోమంది జర్నలిస్టులకు దారి చూపిన మార్గదర్శిగా నిలిచారు.

సినిమాలోని లోతుపాతులను పట్టుకున్న బీఏ రాజు గారు, తన సతీమణి, దివంగత బి. జయ గారితో కలిసి నిర్మాతగా మారారు. ‘చంటిగాడు’, ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కథ ఎంపికలో, సాంకేతిక విలువలను కాపాడటంలో ఆయన చూపిన ప్రతిభ నేటితరం నిర్మాతలకు ఒక పాఠం.

సూపర్ స్టార్ కృష్ణ గారితో మొదలైన ఆయన ప్రయాణం, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరీర్‌లో ఒక ముఖ్యమైన భాగమైంది. మహేష్ బాబు గారికి కేవలం పీఆర్ఓగానే కాకుండా, ఒక ఆత్మీయుడిగా, శ్రేయోభిలాషిగా ఆయన అందించిన సహకారం వెలకట్టలేనిది. సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఒక తండ్రిలా, ఒక అన్నలా అండగా నిలబడే మనిషి ఆయన.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు పాత్రికేయ రంగాన్ని సుసంపన్నం చేశాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారి వృత్తి గౌరవం కోసం ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయనను ఎవరైనా కలిసినప్పుడు కలిగే ఆత్మీయత, ఆయన ఇచ్చే విలువైన సలహాలు.. ఇవన్నీ ఆయనలోని విశాల హృదయానికి సాక్ష్యాలు.

సినిమా అంటే ఆయనకు వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక ఆరాధన. తన శ్వాసలో, ధ్యాసలో కేవలం సినిమాను మాత్రమే నింపుకున్న మహనీయుడు ఆయన. నేడు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన వెదజల్లిన స్ఫూర్తి తెలుగు సినీ పాత్రికేయ రంగంలో ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంది. ఆయన బాటలో నడుస్తున్న ఎంతోమంది మీడియా మిత్రులే ఆయనకు నిజమైన నివాళి. ఈ ఐదవ వర్ధంతి సందర్భంగా, తెలుగు సినీ పరిశ్రమకు దిశానిర్దేశం చేసిన ఆ లెజెండ్‌కు మనసారా స్మరించుకుందాం. ఆయన సేవలు, ఆయన నిబద్ధత తెలుగు సినిమా ఉన్నంత కాలం సజీవంగా ఉంటాయి.

Keerthi