వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతోన్న సరికొత్త చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, టాలీవుడ్ ప్రముఖ స్టార్ రైటర్, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాను, త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘రాజవంశీ’ విడుదల చేస్తుండటం విశేషం.
పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “రాజవంశీ వచ్చి నాకు ఈ సినిమా టైటిల్ చెప్పగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి. ‘కళ్యాణం కమనీయం జీవితం’ అనే పేరు చాలా బాగుంది. పోస్టర్ చూస్తుంటేనే డైరెక్టర్ విజన్ ఏంటో అర్థమవుతోంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ అందరికీ నా ప్రత్యేక అభినందనలు” అని పేర్కొన్నారు.
నిర్మాతలు పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల మాట్లాడుతూ.. తాము అడగ్గానే వచ్చి పోస్టర్ విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక అద్భుతమైన కథ, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించామని, ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ అవుతారని వారు నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. “విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి గొప్ప రచయిత మా సినిమా పోస్టర్ లాంచ్ చేయడం అంటేనే సగం సక్సెస్ సాధించినంత ఆనందంగా ఉంది. నిర్మాతలు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రేమ, సస్పెన్స్ ఎలిమెంట్స్ కలయికతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది” అని చెప్పారు.