సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), విలక్షణ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ చిత్రం మాఫియా, రివెంజ్ డ్రామా మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన యాక్షన్ డోస్‌తో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) గురించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టోటల్ షూటింగ్ పార్ట్ అధికారికంగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
నెల్సన్ మాస్టర్ ప్లాన్..
నిజానికి ఈ సినిమా టాకీ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తయింది. అయితే, అవుట్‌పుట్ చూసుకున్న దర్శకుడు నెల్సన్.. కథను మరింత పవర్‌ఫుల్‌గా మార్చడం కోసం కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయాలని భావించారు. ఇందుకోసం రీసెంట్‌గా మరో 25 రోజుల పాటు ప్రత్యేక షెడ్యూల్ నిర్వహించి మరికొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేశారు. తాజాగా ఆ పనులు కూడా వందకు వంద శాతం పూర్తయ్యాయి.
హృతిక్ రోషన్ పవర్‌ఫుల్ క్యామియో..
ఈ సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇటీవల హృతిక్ రోషన్ సడన్‌గా చెన్నై రావడంతో ఈ రూమర్స్ నిజమని తేలిపోయింది. నెల్సన్ ప్లాన్ చేసిన ఆ 25 రోజుల స్పెషల్ షెడ్యూల్‌లోనే హృతిక్‌కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లను పిక్చరైజ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మల్టీస్టారర్ హంగామా.. రిలీజ్ ఎప్పుడంటే?
మొదటి భాగంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ వంటి స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో మెరిసి సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లగా.. పార్ట్-2 లో కూడా అదే తరహా మల్టీస్టారర్ హంగామా కొనసాగనుంది. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే: ‘జైలర్’ మొదటి భాగం ఏ పాయింట్ దగ్గరైతే ఎండ్ అయిందో.. సరిగ్గా అదే పాయింట్ నుంచే ‘జైలర్ 2’ కథ ప్రారంభం కాబోతోందని కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ గతంలోనే హింట్ ఇచ్చారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.