Find Articles

అఖిల్ ‘లెనిన్’ ప్రెస్‌మీట్‌లో అసలు విషయాలు లీక్ చేసిన నాగ్!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) సరికొత్త ఊరమాస్, రగ్గడ్ లుక్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna), సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున, అఖిల్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన, ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు.

కంటెంటే మాట్లాడుతుంది.. చాలా మారిపోయాను: అఖిల్
ప్రెస్‌మీట్‌లో అఖిల్ మాట్లాడుతూ.. “ఈ ‘లెనిన్’ సినిమా కథ విన్నాక నాలో మానసికంగా చాలా మార్పు వచ్చింది. లోపల ఎంతో ప్రశాంతత ఏర్పడింది. నిజం చెప్పాలంటే ఒకప్పటిలా నేను ఇప్పుడు లేను. ఈ సినిమాలో నా ‘లెనిన్’ క్యారెక్టర్ అలాంటిది. ఈ పాత్ర కోసం నన్ను నేను మెంటల్‌గా చాలా సిద్ధం చేసుకున్నాను. జులై 10న మూవీ మీ ముందుకు వస్తోంది. దీని గురించి ఇప్పుడే నేనేం ఎక్కువ మాట్లాడను. సినిమా విడుదలయ్యాక థియేటర్లలో కంటెంటే మాట్లాడుతుంది” అంటూ సినిమాపై బలమైన ధీమా వ్యక్తం చేశారు.

అఖిల్‌లో ఆ బాధ ఉంది.. నాన్నగారి సెంటిమెంట్ రిపీట్: నాగార్జున
ఇక ఈ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున మాట్లాడిన మాటలు అక్కినేని అభిమానుల గుండెలను పిండేస్తున్నాయి. “ఈ సినిమాలో అఖిల్‌ను చూసి ఒక తండ్రిగా చాలా మురిసిపోయాను. నాకు ఇందులో ఒక సరికొత్త అఖిల్ కనిపించాడు. దయచేసి నా కెరీర్‌ను, అఖిల్ కెరీర్‌తో పోల్చకండి. ఈ చిత్రాన్ని మీరు మనసారా ఆదరిస్తే.. ఇది మా నాన్నగారి ‘మనం’ లాంటి ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోతుంది. ఏ తండ్రి అయినా తన బిడ్డ కెరీర్ బాగుండాలనే కోరుకుంటాడు. నేను నా కెరీర్‌లో ఏ సినిమాకూ ఇంతగా ఇన్వాల్వ్ కాలేదు. నాన్నగారి లాస్ట్ మూవీ ‘మనం’ ప్రమోషన్ల తర్వాత.. మళ్లీ ఇప్పుడు నా బిడ్డ సినిమా కోసం అంతలా ఇన్వాల్వ్ అయి పని చేస్తున్నా” అని నాగ్ ఎమోషనల్ అయ్యారు.

రిలీజ్ డేట్ వాయిదా, సెంటిమెంట్: “నేను ఇప్పటివరకు ఏ సినిమా విడుదల తేదీ ప్రకటించినా మాట తప్పలేదు. కానీ, సినిమాలో కొన్ని మార్పులు చేసి మరింత బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వాలని ప్రొడక్షన్ టీం, నాగవంశీ అడిగారు. అందుకే డేట్ మార్చాల్సి వచ్చింది. అఖిల్‌లో ఒక రకమైన బాధ ఉంది.. దానికి ఈ సినిమా కథ సరిగ్గా కుదిరింది. డైరెక్టర్ మురళీ ఈ స్క్రిప్ట్‌తో వచ్చినప్పుడు.. ఇది ‘శ్రీరామాపురం’ నేపథ్యంలో జరిగే కథని చెప్పారు. మా నాన్నగారు (ANR) పుట్టిన ఊరు పేరు కూడా అదే కావడంతో నాకు ఇదొక పెద్ద సెంటిమెంట్‌గా అనిపించింది. ఈ సినిమాలో ‘భారతి’ అనే పాత్ర గుండె చప్పుడులా నిలుస్తుంది.” అని నాగార్జున చెప్పుకొచ్చారు.

నాగ్ ఇచ్చిన ఈ స్పీచ్‌తో ‘లెనిన్’ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు అక్కినేని ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 10న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Keerthi