మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Dont Trouble The Trouble). శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో పాటు జక్కన్న తనయుడు ఎస్ఎస్ కార్తికేయ అత్యంత భారీగా నిర్మించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది.
రాజమౌళి, కీరవాణితో స్పెషల్ ఇంటర్వ్యూ.. చివర్లో ఊహించని ట్విస్ట్!
వినాయక చవితి పండగ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో హీరో ఫహాద్ ఫాజిల్, నటి సారా పాలేకర్లతో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి, మరియు నిర్మాత ఎస్ఎస్ కార్తికేయలు పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అయితే ఇంటర్వ్యూ ముగింపులో చిత్రబృందం సరదాగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట (Ganesh Laddu Auction) ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఏకంగా రూ. కోటి పలికిన గణనాథుడి ప్రసాదం!
ఈ వేలం పాటలో రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 1 కోటి బిడ్ పాడి ఆ పవిత్రమైన వినాయకుని లడ్డూను రాజమౌళి దక్కించుకున్నారు. జక్కన్న దెబ్బకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ లడ్డూ వేలం పాట వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, అక్టోబర్ 2న రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.