టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతోంది.. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా 3 నిమిషాల 7 సెకన్ల పాటు సాగిన ఈ ట్రైలర్ కట్, సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఈ ట్రైలర్లో మేకర్స్ అనుసరించిన వ్యూహం అద్భుతమనే చెప్పాలి. రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా, అతని పాత్ర చుట్టూ మరింత ఆసక్తిని, అంచనాలను పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ముఖ్యంగా వర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ చెప్పే డైలాగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక్కడ ఉన్న ప్రతి కుర్రాడికి ఫేవరెట్ గేమ్ మారుతుందేమో కానీ, ఫేవరెట్ ప్లేయర్ మాత్రం పెద్ది అవుతున్నాడు. అతనేమైనా దేవుడా అంటే.. అతను గుళ్లో దేవుడు కాదు, గ్రౌండ్లో దేవుడు” అంటూ బొమన్ ఇరానీ చెప్పిన డైలాగ్, ఈ సినిమాకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎంత కీలకమో స్పష్టం చేస్తోంది. దీనికి తోడు రామ్ చరణ్ నోట వచ్చిన “ఆటే నా పొగరు” అనే పవర్ఫుల్ లైన్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అందరిలోనూ అనుమానాలను, క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. సినిమాలో ఆమె ఎమ్మెల్యే కూతురిగా నటిస్తోందని ముందు నుంచి ప్రచారం జరిగినప్పటికీ.. ట్రైలర్ చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా, ఏదో పెద్ద ట్విస్ట్ దాగి ఉన్నట్లు అనిపిస్తోంది.
మరోవైపు, సీనియర్ నటుడు జగపతిబాబు ‘అప్పలసూరి’గా కేవలం రెండు షాట్స్‌లోనే కనిపించి మెరిశారు. ఆయన పాత్రను చూస్తుంటే, ఈ సినిమాలో కేవలం ఆట మాత్రమే కాకుండా.. బ్యాక్‌గ్రౌండ్‌లో అంతకుమించిన ఒక బలమైన సామాజిక అంశాన్ని లేదా గంభీరమైన సమస్యను డీల్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
నటి దివ్యాంశ శర్మ నోట వచ్చిన “ఆట కూలిన కొడుకు” అనే డైలాగ్ రామ్ చరణ్ పాత్ర వెనుక ఉన్న ఇంటెన్సిటీని చూపిస్తోంది. అలాగే చరణ్ అండ్ టీమ్ ఆట వస్తువులతో కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లే విజువల్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ‘కుస్తీ’, ‘రన్నింగ్’ వంటి క్రీడలు కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు.
ట్రైలర్‌తో సినిమా కథ మొత్తం తెలిసిపోతుందని అంతా భావించారు, కానీ మేకర్స్ మాత్రం చాలా తెలివిగా అసలు కథేంటో రివీల్ చేయకుండానే.. సినిమా చూడాలనే కసిని, ఆసక్తిని వంద రెట్లు పెంచడంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి ‘పెద్ది’ ట్రైలర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటకు సిద్ధమనే సంకేతాలను గట్టిగానే పంపింది!