ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో తెగబడుతున్న డీప్‌ఫేక్ వికృతాలు, విడుదల కాకముందే సినిమాలపై విషం చిమ్మే ‘పెయిడ్ నెగెటివిటీ’ టాలీవుడ్‌ను దారుణంగా పట్టిపీడిస్తున్నాయి. ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల విజువల్స్‌ను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన హేయమైన ఉదంతం నుంచి, సినిమాలను తొక్కేసే సైబర్ దాడుల వరకు.. టాలీవుడ్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ డిజిటల్ అరాచకాలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Vishnu Manchu) అత్యంత ఘాటుగా స్పందిస్తూ, వికృత చేష్టలకు పాల్పడుతున్న ముఖం లేని ట్రోలర్స్‌కు మైండ్ బ్లాకింగ్ హెచ్చరికలు జారీ చేశారు.
సోషల్ మీడియాకి ఆధార్ లింకింగ్?
ఈ వ్యాఖ్యల్లో అసలు సంచలనం మరియు సోషల్ మీడియా వేదికల్లో పెను దుమారం రేపుతున్న ప్రధాన అంశం ఏమిటంటే.. సోషల్ మీడియా ఖాతాలన్నింటికీ ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలంటూ విష్ణు మంచు చేసిన సంచలన డిమాండే!
“అనామక ఖాతాలకు ముఖాలు లేవు.. అందుకే వారికి ఏ తప్పైనా చేసేందుకు భయం లేదు” అని హీరో రామ్ పోతినేని గతంలో చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ మంచు విష్ణు ఇండస్ట్రీ తరుపున గట్టి వార్నింగ్ ఇచ్చారు:
-
ఆధార్ లింకింగ్ ప్రతిపాదన: అనామకత్వం ముసుగులో వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం, మహిళలను అసభ్యకరంగా టార్గెట్ చేయడం ఇకపై చెల్లదని, ప్రతి సోషల్ మీడియా యూజర్ గుర్తింపునకు ఆధార్‌ను లింక్ చేసే దిశగా సీరియస్‌గా ఆలోచించాలని స్పష్టం చేశారు.
-
ఫేక్ అకౌంట్ల డేటా సేకరణ: స్టార్ హీరోల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని తోటి నటులపై, సినిమాలపై విషం చిమ్మే వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ల వివరాలను ‘మా’ (MAA) ఇప్పటికే సేకరిస్తోందని బాంబు పేల్చారు.
-
రిలీజ్‌కి ముందే తొక్కేసే కుట్రలు: సందీప్ కిషన్ ప్రాజెక్ట్‌పై కావాలని విషం చిమ్మడం, ‘ది ప్యారడైజ్’ చిత్ర యూనిట్ విడుదల కాకముందే కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది పేద సినీ కార్మికుల కష్టంతో నిర్మితమయ్యే సినిమాలను కనీసం విడుదలైనా కానివ్వాలని హితవు పలికారు.
ట్రోలర్స్‌పై చట్టబద్ధ చర్యలకు సిద్ధమైన టాలీవుడ్!
నిజాయితీతో కూడిన రివ్యూలను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, కానీ డీప్‌ఫేక్ వేధింపులకు, పెయిడ్ ట్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసి నేరస్థులకు చట్టపరంగా గుణపాఠం చెప్పేందుకే టాలీవుడ్ వ్యాప్తంగా ఒక పటిష్టమైన లీగల్ సిస్టమ్‌ను తీసుకురానున్నట్లు విష్ణు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలనే విష్ణు మంచు ప్రతిపాదన ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారితీసింది!