‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత, వైవిధ్యభరిత చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత స్వయంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథా నేపథ్యం
అనిరుధ్ (దిగ్నాథ్ మంచాలే) పెద్దలను ఎదిరించి స్వర్ణ (సమంత)ను పెళ్లి చేసుకుంటాడు. తన చెల్లెలి పెళ్లి కోసం భార్యతో కలిసి సొంత ఊరికి పయనమవుతాడు. అయితే, ఆ ఊరికి వెళ్లే దారిలో స్వర్ణ అనుకోకుండా కరుణ (గుల్షన్ దేవయ్య) అనే వ్యక్తి మనుషుల కళ్లబడుతుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. మరోవైపు అత్తారింట్లో వంట రాకపోయినా, స్నేహితురాలి సహాయంతో మేనేజ్ చేస్తూ కుటుంబంలో కలిసిపోవాలని స్వర్ణ ప్రయత్నిస్తుంటుంది. కానీ, కరుణ ఆమెను వెతుక్కుంటూ రావడం వల్ల స్వర్ణతో పాటు ఆమె భర్త కుటుంబం కూడా పెద్ద ప్రమాదంలో పడుతుంది. అసలు కరుణకు, స్వర్ణకు ఉన్న పాత శత్రుత్వం ఏమిటి? స్వర్ణ గతం ఏంటి? ఈ ఆపద నుండి తన కుటుంబాన్ని ఆమె ఎలా కాపాడుకుంది? అనేదే మిగతా సినిమా.
సినిమా విశ్లేషణ
‘కలిసుందాం రా’ లాంటి ఒక అచ్చమైన కుటుంబ కథకు, ‘బాషా’ తరహా పవర్ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌ను జోడిస్తే ఎలా ఉంటుందో… సరిగ్గా ఈ సినిమా అలాగే సాగుతుంది. ప్రథమార్ధంలో సమంతను ఒక సాధారణ గృహిణిగా చూపిస్తూనే, ఆమె గతం చుట్టూ ఆసక్తికరమైన సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో దర్శకురాలు నందిని రెడ్డి సఫలమయ్యారు. కథ నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, సమంత యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, కథనంలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్‌ప్లే చాలా వరకు ఊహకు అందేలా (ప్రెడిక్టబుల్) సాగడం మైనస్ పాయింట్స్. ద్వితీయార్ధంలో కథ కాస్త వేగం పుంజుకున్నప్పటికీ, విలన్ పాత్రను రాసుకున్న తీరు కొంత గందరగోళంగా అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన బలమైన ఎమోషన్స్ ఇందులో సరిగ్గా పండలేదు.
నటీనటుల ప్రతిభ
ఇది పూర్తిగా సమంత ‘వన్ ఉమెన్ షో’. ఒకవైపు అమాయకపు హౌస్‌వైఫ్‌గా, మరోవైపు నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పవర్ఫుల్ యువతిగా రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా జీవించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో సమంత నటన ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ అని చెప్పాలి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించినప్పటికీ, డబ్బింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. సమంత భర్తగా నటించిన దిగ్నాథ్ మంచాలే తన పరిధి మేర బాగానే చేశాడు. శ్రీముఖి, గౌతమి మరియు సమంత స్నేహితురాలి పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లలో నవ్వులు పూయించాయి.
సాంకేతిక విభాగం
నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అమ్మాయి, ఆ గతాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని వెతుక్కునే లైన్ బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి, కానీ తిరుపతి యాసను పలకడంలో సమంత అక్కడక్కడా కొద్దిగా తడబడినట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. అయితే, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి, రన్‌టైమ్‌ను కాస్త తగ్గించి ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
చివరిగా: ‘మా ఇంటి బంగారం’ – సమంత అభిమానులను అలరించే ఒక యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా!