Find Articles

మోస్ట్ స్టైలిష్ అవతార్‌లో దుల్కర్.. ‘ఐ యామ్ గేమ్’తో ఆగస్టులో బాక్సాఫీస్ వేట!

మలయాళ సూపర్ స్టార్, పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఐ యామ్ గేమ్. దుల్కర్ కెరీర్‌లో 40వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో పీరియాడిక్ డ్రామాలు, వింటేజ్ లుక్స్‌తో మెప్పించిన దుల్కర్.. ఈసారి రూటు మార్చి తన కెరీర్‌లోనే ‘మోస్ట్ స్టైలిష్’ అవతార్‌లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోకి ‘ఐ యామ్ గేమ్’ అత్యంత స్టైలిష్ ఫిల్మ్. ఇందులో నా పాత్ర మాత్రమే కాదు, సినిమా ప్రపంచం మొత్తం చాలా మోడర్న్‌గా ఉంటుంది” అని ఆయన వెల్లడించారు. ‘ఆర్డీఎక్స్’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు నహాస్ హిదాయత్, దుల్కర్‌ను ముందెన్నడూ చూడని రీతిలో ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు.

ఈ సినిమా మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదు. దక్షిణ భారతదేశంలోని సుమారు 100కి పైగా విభిన్న లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టంట్ మాస్టర్స్ ‘అన్బరివ్’ ఆధ్వర్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ అందిస్తున్న స్వరాలు ఈ థ్రిల్లర్‌కు ప్రధాన బలం కానున్నాయి.

కేవలం దుల్కర్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కాయదు లోహర్, కతిర్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘లోకా’ వంటి భారీ విజయం తర్వాత వే ఫారర్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ ఉంది.

నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వస్తున్న ఐ యామ్ గేమ్ కేవలం మలయాళానికే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో 2026 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Keerthi