Find Articles

తమిళ పాలిటిక్స్‌లో ‘పుష్ప’ రచ్చ… సీఎం విజయ్‌పై ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం తమిళనాడు రాజకీయాలవైపే చూస్తోంది. సినిమా తెరపై రారాజుగా వెలిగిపోయిన ‘దళపతి’ విజయ్, రాజకీయ రణక్షేత్రంలోనూ అదే వేగంతో దూసుకెళ్లి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీవీకే పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకోవడం ఒక ఎత్తైతే.. అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ బలపరీక్షలో నెగ్గడం మరో సంచలనం. అయితే, ఈ గెలుపు వెనుక ‘సోఫా రాజకీయం’ ఉందంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తమిళ అసెంబ్లీ వేదికగా ఉదయనిధి స్టాలిన్ విసిరిన విమర్శలు నేరుగా తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా ‘పుష్ప’ సీన్లను తలపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’లో హీరో పుష్పరాజ్, ఒక కేంద్రమంత్రిని కలవడానికి ముందే నోట్ల కట్టలతో నిండిన సోఫాను కానుకగా పంపిస్తాడు. అలాగే రావు రమేష్ పాత్రను సీఎం చేయడానికి ఎమ్మెల్యేలందరికీ డబ్బులు కూరిన సోఫా సెట్లను పంపిణీ చేసే సీన్ సినిమాకే హైలైట్. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్న ఉదయనిధి, విజయ్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి గారు ‘పుష్ప’ స్టైల్‌లో సోఫా పాలిటిక్స్ చేస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యేల ఇంటికి సోఫా వెళ్తుంది.. ఆ తర్వాతే సీఎం గారు బొకే పట్టుకుని అక్కడికి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలను అప్పుగా తెచ్చుకుని, హార్స్ ట్రేడింగ్‌తో  ప్రభుత్వాన్ని నడుపుతున్నారు” అంటూ ఘాటుగా విమర్శించారు.

ఉదయనిధి చేసిన ఈ ‘సోఫా సెట్’ ఆరోపణలపై ముఖ్యమంత్రి విజయ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. తనపై వస్తున్న హార్స్ ట్రేడింగ్ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. “ప్రభుత్వాన్ని నడపడానికి నాకు రేసు గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు”అని విజయ్ స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థానానికి వచ్చానని చెప్పారు.

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఈ వాదోపవాదాలతో తెలుగు సినిమా ‘పుష్ప’ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాలోని సీన్లను నిజ జీవిత రాజకీయాలకు ముడిపెడుతూ మీమార్స్ సందడి చేస్తున్నారు. సినిమా ప్రభావం రాజకీయాలపై ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఉదయనిధి వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ సీఎం అయిన విజయ్, ఉదయనిధి విసిరిన ఈ ‘సోఫా’ సవాల్‌ను ఎలా అధిగమిస్తారో.. రాబోయే రోజుల్లో తమిళ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి!

Keerthi