Find Articles

ఆ విషయాల్లో 80% డైరెక్టర్లు ఫెయిల్ అవుతారు: ‘దందా’ డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి

వర్టికల్ ఫార్మాట్‌లో ‘ఛాయ్ షాట్స్’ యాప్ ద్వారా విడుదలైన ‘దందా’ (Dhandha) మైక్రో సిరీస్ బాక్సాఫీస్ ట్రెండ్‌ను మార్చేస్తూ డిజిటల్ స్పేస్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్‌కు వస్తున్న అపూర్వ స్పందనపై దర్శకుడు ఆదిత్య దేవులపల్లి స్పందిస్తూ తన సినీ ప్రయాణం, సిరీస్ మేకింగ్ అనుభవాలు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గాడ్‌ఫాదర్ లేకుండా 28 ఏళ్లకే డైరెక్టర్‌గా!

తన సినీ నేపథ్యం గురించి ఆదిత్య మాట్లాడుతూ.. “నేను చదువులో టాపర్‌నే అయినా, సినిమాలపై ఉన్న తీవ్రమైన పిచ్చి ప్యాషన్‌తో ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసి రాడికల్ నిర్ణయం తీసుకున్నా. ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ లేకపోయినా ఫోటోగ్రఫీ, సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ నేర్చుకుని జర్నలిజంలోకి వచ్చా. అక్కడి కాంటాక్ట్స్‌తో చాయ్ బిస్కెట్ అనురాగ్‌కి కథ చెప్పడం, ఆయన నన్ను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ చేసుకోవడం జరిగాయి. 28 ఏళ్లకల్లా డైరెక్టర్ కావాలనే నా కల ‘దందా’తో నిజమైంది” అని వెల్లడించారు.

“80% మంది బిగ్ మూవీ డైరెక్టర్లు ఇక్కడ ఫెయిల్ అవుతారు!”

వర్టికల్ కంటెంట్ మేకింగ్‌లో ఉన్న సవాళ్లను వివరిస్తూ.. “సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ దగ్గర హైస్ అండ్ లోస్ ఉంటాయి. కానీ మైక్రో డ్రామాలో సెటప్ చేయడానికి టైమ్ ఉండదు; మొదటి సెకన్ నుంచే ఆడియెన్స్‌ను హుక్ చేయాలి. ఇక్కడ ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్ లాగే ఉండాలి! నిజం చెప్పాలంటే సినిమాల కంటే మైక్రో డ్రామాలు తీయడమే చాలా కష్టం. పెద్ద పెద్ద డైరెక్టర్లలో 80% మంది మైక్రో డ్రామా తీస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి” అని ఆదిత్య సంచలన కామెంట్స్ చేశారు.

దొరసాయి తేజతో తదుపరి సినిమా 5 రెట్లు వైల్డ్‌గా!

నటుడు దొరసాయి తేజ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆదిత్య, “తేజ నటనలోని అసలు పవర్ ఇంకా ఎవరూ చూడలేదు. సింగిల్ టేక్‌లో మోనోలాగ్స్ చెప్పి మైండ్ బ్లాక్ చేశాడు. తనపై నాకు, నా కథపై తనకి ఉన్న బ్లైండ్ ట్రస్ట్ ఈ అవుట్‌పుట్‌కు కారణం. నా నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం పక్కా తేజతోనే ఉంటుంది. అది ‘దందా’ కంటే ఐదు రెట్లు వైల్డ్‌గా ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

సైబర్ క్రైమ్‌పై అవేర్‌నెస్.. రాజమౌళికి ట్రిబ్యూట్!

సిరీస్‌లో దర్శకధీరుడు రాజమౌళి సీన్ గురించి చెప్తూ.. “రాజమౌళి సర్ ఒక లెజెండ్.. నా ఫస్ట్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావాలనే ఆశ ఉండేది. అందుకే సైబర్ క్రైమ్‌పై ఆయన చేసిన అవేర్‌నెస్ వీడియోను ట్రిబ్యూట్‌గా వాడాం” అని తెలిపారు. అంతేకాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సైబర్ నేరగాళ్ల దారుణాలను చూపిస్తూ ప్రజల్లో అవగాహన తెచ్చేలా ఈ కథను రూపకల్పన చేశామన్నారు.

తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ, ప్రస్తుతం ఒక 50 ఏళ్ల నేరస్థుడి (50-year-old criminal) చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నానని, రాబోయే రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ఆదిత్య ముగించారు.

Keerthi