Find Articles

ఎట్టకేలకు క్లియరెన్స్.. దళపతి విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్!

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్‌’ (Jana Nayagan) కోసం ఆయన అభిమానులు ఎన్నో నెలల నుంచి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ (Censor Certificate) విషయంలో నెలకొన్న కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యమైన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ నెలలోనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ విడుదల తేదీపై ప్రముఖ కెనడా డిస్ట్రిబ్యూటర్ హింట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో దళపతి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

జూలై 24న కెనడాలో గ్రాండ్ రిలీజ్..

కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘యార్క్ సినిమాస్’ (York Cinemas) సోషల్ మీడియా వేదికగా ఒక అఫీషియల్ పోస్ట్ పెడుతూ.. “ఎట్టకేలకు మన దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమాతో వెండితెరపై మెరిసేందుకు రెడీ అయ్యారు. జూలై 24 నుండి కెనడాలో యార్క్ సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది” అని ప్రకటించింది. అంతేకాదు, త్వరలోనే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయని క్లారిటీ ఇచ్చింది. ఓవర్సీస్ లో జూలై 24న రిలీజ్ కానుండటంతో.. అంతకంటే ఒక రోజు ముందుగానే (జూలై 23న) భారతదేశంలో ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెన్సార్ సమస్యలు క్లియర్.. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటనకు రెడీ!

ఇన్నాళ్లూ సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని కీలక మార్పుల కారణంగానే ఈ సినిమా ల్యాబ్‌లోనే ఉండిపోయింది. అయితే తాజాగా చిత్రబృందం ఆ మార్పులన్నింటికీ అంగీకరించడంతో రూట్ క్లియర్ అయ్యింది. మరో రెండు రోజుల్లోనే అధికారికంగా సెన్సార్ సర్టిఫికెట్ చేతికి రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి కాగానే చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సరికొత్త పోస్టర్‌తో అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనుంది. ఇప్పటికే జూలై 24 రిలీజ్‌కు సిద్ధంగా ఉండాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా మేకర్స్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ నెలలోనే దళపతి బాక్సాఫీస్ వేట మొదలుకాబోతుండటంతో థియేటర్లలో రికార్డుల వేట ఖాయంగా కనిపిస్తోంది.

Keerthi